ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు. కానీ గత కొద్దిరోజులుగా ఏపీ సోషల్ మీడియా వేదికగా ఒక సరికొత్త, ఆహ్లాదకరమైన వాతావరణం చర్చనీయంశంగా మారింది. బద్ద శత్రువులుగా భావించే నేతలు సైతం రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి, ఒకరినొకరు పలకరించుకోవడం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(chandrababu) పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(ys Jagan) మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎప్పుడూ అసెంబ్లీలోనూ, బయట విమర్శలతో విరుచుకుపడే జగన్, ఈసారి చాలా హుందాగా స్పందించారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా చంద్రబాబు కూడా ధన్యవాదాలు తెలపడం విశేషం. ఇక మొన్న.. వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రత్యర్థి కుటుంబానికి చెందిన పెద్దవారిని గౌరవించే సంప్రదాయాన్ని లోకేష్ పాటించారని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే, ఇది కేవలం రాజకీయ వ్యూహం అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ట్వీట్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు(pawan kalyan) ఇటీవల జరిగిన చిన్నపాటి శస్త్రచికిత్స నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని జగన్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. థాంక్యూ జగన్ గారు అంటూ పవన్ స్పందించడం గమనార్హం.
సాధారణంగా ఎన్నికలతో సంబంధం లేకుండా.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకునే నేతలు, ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వేదికగా పలకరించుకోవడం ఏపీ రాజకీయాల్లో ఒక హెల్తీ ట్రెండ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటుంటే, అధినేతలు మాత్రం హుందాగా వ్యవహరించడం కార్యకర్తలకు ఒక సందేశం పంపినట్లయ్యింది.